Revised Common Lectionary (Semicontinuous)
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
మోషేను, యెహోషువను యెహోవా పిలవటం
14 “నీవు చనిపోయే సమయం దగ్గరపడింది. యెహోషువను వెంటబెట్టుకుని, సన్నిధి గుడారం దగ్గరకు రా. యెహోషువ చేయాల్సిన పనులు నేను ఆతనికి చెబుతాను” అని మోషేతో యెహోవా చెప్పాడు. కనుక మోషే, యెహోషువ సన్నిధి గుడారానికి వెళ్లారు.
15 ఆ గుడారంలో ఒక మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభం గుడార ద్వారం దగ్గర నిలిచింది. 16 మోషెతో యెహోవా ఇలా చెప్పాడు: “త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీకులతో ఉండేందుకు వెళ్లిపోయిన తర్వాత, ఈ ప్రజలు నాకు నమ్మకంగా ఉండరు. నేను వాళ్లతో చేసిన ఒడంబడికను వాళ్లు ఉల్లంఘిస్తారు. వాళ్లు నన్ను విడిచిపెట్టేసి, వారు వెళ్తున్న దేశంలోని ఇతర దేవుళ్లను, అబద్ధపు దేవుళ్లను పూజించటం మొదలు పెడ్తారు. 17 ఆ సమయంలో నేను వారిమీద చాలా కోపగించి, వాళ్లను విడిచి పెడ్తాను. వాళ్లకు సహాయం చేయటానికి నేను ఒప్పుకోను, వాళ్లు నాశనం చేయబడతారు. వాళ్లకు భయంకరమైన సంగతులు జరుగుతాయి, వాళ్లకు కష్టాలు వస్తాయి. అప్పుడు ‘మన దేవుడు మనతో లేడు గనుక ఈ కీడులు మనకు కలిగాయి’ అని వారు అంటారు. 18 వాళ్లు కీడు చేసి, ఇతర దేవుళ్లను పూజించారు గనుక నేను వారికి సహాయం చేయటానికి ఒప్పుకోను.
19 “కనుక ఈ పాట వ్రాసుకొని, ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించు, అది పాడటం వారికి నేర్పించు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నాకు ఈ పాట సాక్ష్యంగా ఉంటుంది. 20 వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన, మంచి వాటితో నిండిపోయిన దేశం లోనికి నేను వాళ్లను తీసుకొని వెళ్తాను. వారు తినేందుకు కావాల్సినవి అన్నీ వారికి ఉంటాయి. ఐశ్వర్యవంతమైన జీవితం వారికి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్లు యితర దేవుళ్ల వైపు తిరిగి, వారిని సేవిస్తారు. నా నుండి వాళ్లు తిరిగిపోయి నా ఒడంబడికను ఉల్లంఘిస్తారు. 21 అప్పుడు వాళ్లకు ఎన్నో భయంకర సంగతులు జరుగుతాయి, వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకు ఈ పాట జ్ఞాపకం ఉంటుంది, వారిది ఎంత తప్పు అని యిది వారికి తెలియజేస్తుంది. నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి నేను యింకా వారిని తీసుకొని వెళ్లలేదు; కానీ వాళ్లు అక్కడ ఏం చేయాలని పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు.”
22 కనుక ఆ రోజే మోషే ఆ పాట వ్రాసాడు. ఆ పాటను ఇశ్రాయేలు ప్రజలకు ఆతను నేర్పించాడు.
క్రేతులో తీతు చేయవలసిన పని
5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. 6 క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. 7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. 8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
© 1997 Bible League International