Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
యెహోవా మహిమ
34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది. 35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.
36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు. 37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు. 38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.
బాబిలోను పతనము
18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. 2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు:
“బాబిలోను మహానగరం
కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
అది సంచరించు స్థలమైంది.
3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”
4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:
“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
నేను ఎన్నటికీ వితంతువును కాను.
నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
8 అందువల్ల చావు, దుఃఖము, కరువు,
తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.
9 “దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
శక్తివంతమైన బాబిలోను నగరమా!
ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’
అని విలపిస్తారు.
19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే!
ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు!
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి.
అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”
అని అంటారు.
© 1997 Bible League International