Revised Common Lectionary (Semicontinuous)
యెహోవా మహిమను మోషే చూశాడు
12 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు. 13 నిజంగా నేను నీకు ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”
14 “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.
15 అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు. 16 మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”
17 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”
18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను. 20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి బ్రతకలేడు.
21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు. 22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
1 మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!
దేవునికి కృతజ్ఞతలు
2 మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. 3 విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.
4 సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. 5 ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. 6 మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. 8 దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. 9 మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.
యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:13-17; లూకా 20:20-26)
15 ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు. 16 వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. 17 మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.
18 యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? 19 ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. 20 ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు.
21 “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
22 ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
© 1997 Bible League International