Revised Common Lectionary (Semicontinuous)
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
పవిత్ర గుడారాన్ని మోషే తనిఖీ చేయటం
32 కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు. 33 తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు. 34 ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.
35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు. 36 బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు. 37 స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, దాని మీద దీపాలను వారు మోషేకు చూపించారు. దీపాలకు ఉపయోగించే నూనె, ఇతర వస్తువులన్నింటిని వారు మోషేకు చూపించారు. 38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ప్రవేశాన్ని మూసి వుంచే తెరను వారు అతనికి చూపించారు. 39 ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు. 40 ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకులను వారు అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.
41 తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.
42 సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఈ పని అంతా చేసారు. 43 పని అంతటినీ మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు.
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మార్కు 6:14-29; లూకా 9:7-9)
14 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. 2 అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.
యోహాను తల నరకటం
3 అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య. 4 పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు. 5 ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.
6 హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7 అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు. 8 ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.
9 ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. 10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.
© 1997 Bible League International