Revised Common Lectionary (Semicontinuous)
97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
3 యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!
7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
8 సీయోనూ, విని సంతోషించుము!
యూదా పట్టణములారా, సంతోషించండి!
ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.
నేను మీతో రాను
33 అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను. 2 మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచిపెట్టేసేటట్టు బలవంతం చేస్తాను. 3 కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”
4 ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు. 5 “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు. 6 కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు.
13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. 14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.
15 ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము.
17 సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి. 18 నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. 19 వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి. 20 కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము. 21 అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు చేస్తాడు.
చివరి సలహా
4 నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.
© 1997 Bible League International