Revised Common Lectionary (Semicontinuous)
జాయిన్
49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
10 “మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు. 11 మీరు సమకూర్చని మంచి వస్తువులతో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోటలను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది.
12 “కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను మరచిపోకండి. 13 మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు). 14 మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు. 15 మీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. మరియు మీరు ఆ ఇతర దేవుళ్లను వెంబడిస్తే, యెహోవాకు మీ మీద చాలా కొపం వస్తుంది. మిమ్మల్ని ఈ భూమి మీద ఉండకుండా ఆయన నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించటం యెహోవా ద్వేషిస్తాడు.
16 “మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు. 17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్పనిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నింటినీ మీరు పాటించాలి. 18 సరైనవి, మంచివి, యెహోవాను సంతోషపెట్టేవి మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా మేలు జరిగి, యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. 19 మరియు యెహోవా చెప్పినట్టు మీరు మీ శత్రువులందరినీ బలవంతంగా బయటకు వెళ్లగొడ్తారు.
దేవుడు చేసిన వాటిని పిల్లలకు నేర్పించాలి
20 “భవిష్యత్తులో ‘మన దేవుడైన యెహోవా మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు గదా వాటి అర్థం ఏమిటి?’ అని నీ కుమారుడు నిన్ను అడగవచ్చును. 21 అప్పుడు నీవు నీ కుమారునితో ఇలా చెప్పాలి, ‘మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి మనలను బయటకు తీసుకొని వచ్చాడు. 22 మహాగొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన ఈ సంగతులు జరిగించటం మనం చూశాము. 23 మరియు యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఈ ప్రబోధాలన్నీ పాటించాలని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూ క్షేమంగా సజీవులంగా ఉండేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కాపాడతాడు. 25 మనం పాటించాలని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం ఆజ్ఞలన్నింటికీ విధేయులం అవటం మనకు మంచిదిగా దేవుడైన యెహోవా చూస్తాడు.’
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5; మార్కు 14:1-2; లూకా 22:1-2)
45 మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు. 46 కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు. 47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు. 48 అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.
49 వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు. 50 అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.
51-52 యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు.
53 ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు. 54 అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.
55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు. 56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. 57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
© 1997 Bible League International