Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 17:1-7

బండనుండి నీరు ఇవ్వటం

17 ఇశ్రాయేలు ప్రజలంతా కలసి సీను అరణ్యమునుండి ప్రయాణమయ్యారు. యెహోవా ఆజ్ఞాపించినట్లెల్లా ఒక తావు నుండి మరో తావుకు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలు రెఫీదీముకు ప్రయాణం చేసి అక్కడ బసచేసారు. అక్కడ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే మీదికి లేచి, అతనితో వాదించటం మొదలు పెట్టారు. “తాగేందుకు నీళ్లు ఇమ్ము” అని ప్రజలు మోషేను అడిగారు.

అయితే మోషే, “మీరెందుకు నామీదికి ఇలా లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” (యెహోవా మనతో లేడని మీరనుకొంటున్నారా?) అని వారితో అన్నాడు.

కాని ప్రజలు మాత్రం నీళ్ల కోసం చాల దాహంగా ఉన్నారు. అందుచేత వాళ్లు మోషేకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు, “అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అని అన్నారు ప్రజలు.

కనుక మోషే, “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? నన్ను చంపెయ్యటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ యెహోవాకు మొరబెట్టాడు.

మోషేతో యెహోవా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల ముందుకు వెళ్లు. ప్రజల పెద్దలలో (నాయకులు) కొందర్ని నీ వెంట తీసుకొని వెళ్లు. నీ చేతి కర్రను తీసుకొని వెళ్లు. నీవు నైలునదిని కొట్టిన కర్ర యిది. హోరేబులో (సీనాయి పర్వతం) నీ యెదుట ఒక బండమీద నేను నిలబడతాను. కర్రతో ఆ బండను కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలు తాగవచ్చు.”

మోషే ఈ పనులు చేసాడు, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) అది చూచారు. మెరీబా[a] అని మస్సా[b] అని ఆ స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఎందుచేతనంటే, ప్రజలు తన మీదికి లేచి యెహోవాను పరీక్షించిన స్థలం ఇది. యెహోవా వారితో ఉన్నాడో లేదో తెల్సుకోవాలని ప్రజలు కోరారు.

కీర్తనలు. 78:1-4

ఆసాపు ధ్యాన గీతం.

78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
    నేను చెప్పే విషయాలు వినండి.
ఈ కథ మీతో చెబుతాను.
    ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
    మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
ఈ కథను మనము మరచిపోము.
    మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
    ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.

కీర్తనలు. 78:12-16

12 ఈజిప్టులోను, సోయను వద్దను
    దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.
    వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
    ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.
    భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.
    అది ఒక నదిలా ఉంది.

ఫిలిప్పీయులకు 2:1-13

క్రీస్తు వినయంను అనుకరించుట

క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.

నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి

యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.

ఆయన దేవునితో సమానము.
    అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
ఆయన అంతా వదులుకొన్నాడు.
    మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
    మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
    మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
    అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
    ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
    తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!

నక్షత్రాలవలె ప్రకాశించటం

12 నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. 13 దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.

మత్తయి 21:23-32

యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం

(మార్కు 11:27-33; లూకా 20:1-8)

23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.

24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 25-26 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు.

వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.

27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.

ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.

తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం

28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.

29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.

30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.

31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”

“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International