Revised Common Lectionary (Semicontinuous)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
మళ్లీ ప్రజల ఫిర్యాదు
11 ఈ సారి ప్రజలు వారి కష్టాలనుగూర్చి ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదులను యెహోవా విన్నాడు. యెహోవా వీటిని విన్నప్పుడు ఆయనకు కోపం వచ్చింది. యెహోవా దగ్గరనుండి అగ్ని వచ్చి ప్రజల మధ్య రగులుకొంది. వారున్న స్థలంలో ఒక చివర కొన్ని ప్రాంతాలను అగ్ని కాల్చివేసింది. 2 కనుక ప్రజలు మోషేకు మొరపెట్టుకొన్నారు. మోషే యెహోవాను ప్రార్థించగా అగ్ని కాల్చివేయటం ఆగిపోయింది. 3 అందుచేత ఆ చోటు తబేరా[a] అని పిలువబడింది. ఆ ప్రజల మధ్య యెహోవా అగ్నిని దహింపజేసాడు గనుక ఆ స్థలానికి వారు ఆ పేరు పెట్టారు.
70 మంది వృద్ధనాయకులు
4 ఇశ్రాయేలీయులతో చేరిన విదేశీయులు తినేందుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, “తినటానికి మాకు మాంసం కావాలి! 5 ఈజిప్టులో మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూరగాయలు – దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దొరికేవి. 6 కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!” 7 ఆ మన్నా కొతిమెర గింజల్లా ఉండి, చూపునకు చెట్టుమీద జిగురు (బంక)లా ఉంది. 8 ప్రజలు దీనిని పోగుచేసి, నూరి, పిండి చేస్తారు. లేక బండలను ఉపయోగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన రొట్టెల్లా రుచిగా ఉండేవి. 9 ప్రతి రాత్రీ నేల అంతా మంచుతో తడిసినప్పుడు మన్నా నేలమీద కురిసేది.
17 సోదరులారా! నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించేవాళ్ళను, మీ దారికి ఆటంకాలు కలిగించేవాళ్ళను, మీరు నేర్చుకొన్నవాటికి వ్యతిరేకంగా బోధించేవాళ్ళను గమనిస్తూ వాళ్ళకు దూరంగా ఉండండి. 18 అలాంటివాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. 19 మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక!
20 శాంతిదాత అయినటువంటి దేవుడు త్వరలోనే సాతాన్ను మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు.
మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International