Revised Common Lectionary (Semicontinuous)
105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
3 యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
6 దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
యెహోవాను స్తుతించండి.
22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.
23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.
24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.
25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. 26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”
27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు. 28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు? 29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.” 30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.
23 ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం. 24 నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు.
25 శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు.
26 యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.
27 అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం లభిస్తుంది?” అని అన్నాడు.
28 యేసు, “ఇది సత్యం. క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు. 29 నాకోసం ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. 30 కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు. వెనుకనున్న వాళ్ళలో చాలా మంది ముందుకు వస్తారు!” అని అన్నాడు.
© 1997 Bible League International