Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 77

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
    నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
నీవు నన్ను నిద్రపోనియ్యవు.
    నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
    చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
    నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
    ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
    ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
    ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.

10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
    అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

2 రాజులు 2:1-18

ఏలీయాని తీసికొని వెళ్ళటానికి యెహోవా నడిపించుట

సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పరలోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గరపడింది. ఏలీయా ఎలీషాతో గిల్గాలుకు వెళ్లాడు.

ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందుకనగా యెహోవా నన్ను బేతేలునకు వెళ్లుమని ఆదేశించాడు” అని చెప్పాడు.

కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనష్యులు బేతేలుకు వెళ్లారు.

బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి యిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”

“అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలాడకు.” అని ఎలీషా చెప్పాడు.

ఎలీషాతో ఏలీయా, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకనగా నన్ను యెరికోకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అని చెప్పాడు.

కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని చెప్పాడు. అందువల్ల వారిరువురు మనష్యులు యెరికోకు వెళ్లారు.

యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు వచ్చి యిట్లున్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”

ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విషయమై మాటలాడకు” అని చెప్పాడు.

ఏలీయా ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకంటే నన్ను యోర్దాను నది వద్దకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు.

ఎలీషా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల ఆ ఇరువురు వెళ్లారు.

ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు. ఏలీయా తన దుప్పటిని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు.

వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని ఏలీయా అడిగాడు.

“నీ ఆత్మ రెండింతల భాగాముగా నామీదికి వచ్చునట్లు చేయి” అని ఎలీషా అడిగాడు.

10 ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు.

దేవుడు ఏలీయాను పరలోకానికి తీసుకొని పోవుట

11 ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటాలాడుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు.

12 అది ఎలీషా చూచి, నా తండ్రి! “నా తండ్రి! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులు నీవె”[a] అని అరిచాడు.

ఎలీషా ఏలీయాని ఆ తర్వతా ఎన్నడూ చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు. 13 ఏలీయా ధరించు కంబళి భూమిమీదికి పడింది. అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. 14 ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు.

ఏలీయా కోసం ప్రవక్తలు అడుగుట

15 యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకునట్లుగా నమస్కరించారు. 16 అతనితో వారు ఇట్లన్నారు: “ఇదుగో, మా వద్ద ఏభై మంది సజ్జనులున్నారు. వారు వెళ్లి నీ యజమానికోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ ఒకవేళ ఏలీయాని పైకి తీసుకొని పోయి ఏ కొండమీదనో లేక ఏ లోయలోనో పడవేసి వుండవచ్చు.”

కాని ఎలీషా, “వద్దు ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపవద్దు” అని చెప్పాడు.

17 ప్రవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత వరకు ప్రార్థంచారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” అని చెప్పాడు.

ప్రవక్తల బృందం ఆ ఏభై మంది మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు రోజుల పాటు వారు వెతికారు. కాని వారు ఏలీయాను కనుగొనలేక పోయారు. 18 కనుక ఎలీషా నివసించుచున్న యెరికోకి వారు వెళ్లారు. ఏలీయాని తాము కనుగొనలేక పోయామని వాళ్లు అతనితో చెప్పారు. ఎలీషా, “మీరు వెళ్లవద్దని నేను చెప్పాను గదా” అన్నాడు.

మార్కు 11:20-25

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మత్తయి 21:20-22)

20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International