Revised Common Lectionary (Semicontinuous)
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
ఈజిప్టు నుండి బయటకు ప్రయాణం
17 ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.” 18 కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.
యోసేపు ఎముకలు స్వదేశానికి తీసుకొని వెళ్లడం
19 మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.
యెహోవా తన ప్రజలను నడిపించాడు
20 ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. 21 యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది. 22 పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.
పరస్పరం ప్రేమతో ఉండండి
11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.
13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.
16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము.
© 1997 Bible League International