Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
13 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు. 2 “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”
3 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు. 4 అబీబు[a] మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. 5 మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తున్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.
6 “ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది. 7 కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు. 8 ‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”
9 “మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది. 10 కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మార్కు 11:12-14, 20-24)
18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.
21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. 22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.
© 1997 Bible League International