Revised Common Lectionary (Semicontinuous)
పస్కా పండుగ
12 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఈనెల[a] మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది. 3 ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. 4 ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి. 5 గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును. 6 నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి. 7 ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.
8 “ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి. 9 గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద కాల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి. 10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.
11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి[b] (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)
12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను. 13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను.[c] ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.
14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి.
149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
ఆయన వారిని రక్షించాడు!
5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
8 ఆ రాజులకు, ప్రముఖులకు
దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.
యెహోవాను స్తుతించండి!
ప్రేమ
8 తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. 9 “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు”(A) అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది.
11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.
పాపం చేసిన సోదరుడు
(లూకా 17:3)
15 “మీ సోదరుడు మీపట్ల అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి రహస్యంగా చూపండి. అతడు మీ మాట వింటే అతణ్ణి మీరు జయించినట్లే! 16 ఒక వేళ అతడు మీ మాట వినకపోతే, ఒకరిద్దర్ని మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. 17 వాళ్ళ మాట వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ళ సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాటకూడ వినకపోతే అతణ్ణి మీ వానిగా పరిగణించకండి.
18 “ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను. 19 అంతేకాక, నేను చెప్పేదేమిటంటే మీలో యిద్దరు కలసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థించాలి. అప్పుడు పరలోకంలోవున్న నా తండ్రి మీ కోరిక తీరుస్తాడు. 20 ఎందుకంటే, నా పేరిట యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్ళతో ఉంటాను.”
© 1997 Bible League International