Revised Common Lectionary (Semicontinuous)
149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
ఆయన వారిని రక్షించాడు!
5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
8 ఆ రాజులకు, ప్రముఖులకు
దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.
యెహోవాను స్తుతించండి!
అంధకారం
21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.
22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. 23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.
24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.
25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము. 26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.
27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు. 28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.
29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.
15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(A)
16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”(B) 17 తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది.
18 “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది.
వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”(C)
19 “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు:
“జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను
అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.”(D)
20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు:
“నా కోసం వెదకనివాళ్ళు నన్ను కనుగొంటారు.
నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.”(E)
21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు:
“అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న
ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”(F)
© 1997 Bible League International