Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 149

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

నిర్గమకాండము 9:1-7

పశువులకు రోగం

అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’ ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు. ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.”

మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు. ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు.

2 కొరింథీయులకు 12:11-21

కొరింథు ప్రజల విషయంలో చింత

11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. 12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. 13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.

14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. 15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?

16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? 18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.

19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. 20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. 21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International