Revised Common Lectionary (Semicontinuous)
యోసేపు తానెవరని చెప్పుట
45 యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేశాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేశాడు. 2 యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు. 3 యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరుల నోట మాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.
4 కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. 5 ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. 6 భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. 7 కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు. 8 నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.”
ఇశ్రాయేలుకు ఈజిప్టు వచ్చుటకు ఆహ్వానం
9 “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేశాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు. ఇప్పుడే వచ్చేయండి. 10 గోషెను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. 11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’”
12 యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపును అని చూడగలుగుతున్నారు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి. 13 కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.” అన్నాడు అతడు. 14 అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు. 15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
దేవుని దయ
11 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు. 2 తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు:
29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. 30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది. 31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. 32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు.
10 యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. 11 మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు.
12 ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు.
13 యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. 14 వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు.
15 పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు.
16 యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? 17 నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? 18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. 19 ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. 20 వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.
యేసు యూదులు కాని స్త్రీకి సహాయం చేయటం
(మార్కు 7:24-30)
21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.
23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.
24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల[a] కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.
25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.
26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.
27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.
28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.
© 1997 Bible League International