Revised Common Lectionary (Semicontinuous)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.
దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు
43 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం. 2 నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 3 ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథియోపియాను, సెబాను నేను ఇచ్చాను. 4 నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”
5 “కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను. 6 నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. 7 నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”
యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మార్కు 8:1-10)
32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.
33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.
34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు.
“ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. 37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.
© 1997 Bible League International