Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 65:8-13

దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

ఆదికాండము 30:25-36

యాకోబు లాబానును మోసగించుట

25 యోసేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత యింటికి నన్ను వెళ్లనివ్వు. 26 నా భార్యల్ని, పిల్లలను నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను మంచి పని చేసానని నీకు తెలుసు.”

27 అతనితో లాబాను అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలంగానే యెహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు తెలుసు. 28 నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది నీకు నేను చెల్లిస్తాను.”

29 యాకోబు జవాబిచ్చాడు: “నీ కోసం నేను కష్టపడి పని చేసానని నీకు తెలుసు. నీ గొర్రెల మందలను నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా ఉన్నాయి. 30 నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ కోసం నేను ఏదైనా చేసినప్పుడల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.”

31 “అలాగైతే నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు.

యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నీవు నన్ను ఈ ఒక్క పని చేయనిస్తే చాలు: నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను. 32 అయితే ఈ వేళ నీ గొర్రెల మందల్లో నన్ను నడువనియ్యి, వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న ప్రతి గొర్రె పిల్లను నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్ల మేకపిల్లలు అన్నిటిని, చారలు మచ్చలు ఉన్న ప్రతి ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం. 33 నా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడవచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొర్రెగాని నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించినట్లు నీకు తెలుస్తుంది.”

34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్లు మనం చేద్దాం” అన్నాడు లాబాను. 35 అయితే మచ్చలు ఉన్న మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టేశాడు. మచ్చలు ఉన్న ఆడ మేకలన్నింటిని కూడ లాబాను దాచిపెట్టేశాడు. ఈ గొర్రెలను కనిపెట్టి ఉండమని లాబాను తన కుమారులతో చెప్పాడు. 36 కనుక ఆ కుమారులు మచ్చలుగల గొర్రెలన్నింటిని మరో చోటుకు తోలుకొని వెళ్లారు. మూడు రోజుల పాటు వారు ప్రయాణం చేశారు. యాకోబు అక్కడ ఉండి, మిగిలిన జంతువులన్నింటి విషయం జాగ్రత్త పుచ్చుకొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు.

యాకోబు 3:13-18

తెలివిగల వాళ్ళు

13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International