Revised Common Lectionary (Semicontinuous)
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
యాకోబు ఏశావును కలిసికొనుట
33 యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేశాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు. 2 దాసీలను వారి పిల్లలను యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు.
3 యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.
4 యాకోబును చూడగానే అతణ్ణి కలుసుకొనేందుకు ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తుకొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, వారిద్దరు సంతోషముతో ఏడ్చేశారు. 5 ఏశావు చూడగా స్త్రీలు, పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు.
“దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేశాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.
6 తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు. 7 తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.
8 “నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు.
దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.
9 కాని ఏశావు, “సోదరా, నాకు నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నాకు కావాల్సినంత ఉన్నది” అన్నాడు.
10 యాకోబు ఇలా అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమాలుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు కూడా అంగీకరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్లు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. 11 అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను కూడ స్వీకరించమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని యాకోబు ఏశావును బతిమాలాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.
12 అప్పుడు ఏశావు, “ఇంక నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో వస్తాను” అన్నాడు.
13 కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి. 14 అందుచేత నీవు ముందు వెళ్లు. నేను మెల్లగా నీ వెనుక వస్తాను. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”
15 ఏశావు, “అలాగైతే నీకు సహాయంగా నా మనుష్యులను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు.
కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు. 16 కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు. 17 అయితే యాకోబు సుక్కోతుకు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు[a] అని పేరు.
హాగరు మరియు శారా
21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? 22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. 23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.
24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. 25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. 26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. 27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా!
ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా!
గట్టిగా కేకలు వేయి!
ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త
లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”(A)
28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. 29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. 30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి”(B) అని వ్రాయబడి ఉంది. 31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.
క్రీస్తు వల్లనే స్వేచ్ఛ
5 మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి.
© 1997 Bible League International