Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 139:1-12

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.
నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
    యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
    పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
    పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
    ఆ చేతితో నన్ను నడిపిస్తావు.

11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
    “పగలు రాత్రిగా మారిపోయింది.
    తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
    రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.

కీర్తనలు. 139:23-24

23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
    నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
24 చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము.
    శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.

నిర్గమకాండము 14:9-25

ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.

10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. 11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. 12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”

13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! 14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”

15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు 16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు. 17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను. 18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”

ఈజిప్టు సైన్యాన్ని యెహోవా ఓడించటం

19 ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది 20 ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.

21 మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది. 22 ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి. 23 అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి. 24 ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు. 25 రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు.

మత్తయి 7:15-20

ప్రజలు చేయునది వారేమైయున్నారని చూపుతుంది

(లూకా 6:43-44; 13:25-27)

15 “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. 16 వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? 17 మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. 18 మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. 19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. 20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International