Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం
9 తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. 2 నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. 3 వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.
4 అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. 5 తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.
“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
6 యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
7 యెహోవా, నీవే దేవుడివి.
అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం
(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)
12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,
14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,
అతని తమ్ముడు అంద్రెయ.
యాకోబు,
యోహాను,
ఫిలిప్పు,
బర్తొలొమయి,
15 మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడు యాకోబు,
జెలోతె[a] అని పిలువబడే సీమోను
16 యాకోబు కుమారుడు యూదా,
యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).
యేసు బోధించి రోగులను నయం చేయటం
(మత్తయి 4:23-25; 5:1-12)
17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.
© 1997 Bible League International