Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
శారా మరణించింది
23 శారా 127 సంవత్సరాలు జీవించింది. 2 కనాను దేశంలోని కిర్యతర్బా (అనగా హెబ్రోను) పట్టణంలో ఆమె మరణించింది. అబ్రాహాము చాలా దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు. 3 అప్పుడు మరణించిన తన భార్యను విడిచిపెట్టి, హిత్తీ ప్రజలతో మాట్లాడేందుకు అబ్రాహాము వెళ్లాడు. 4 “నేను ఈ దేశవాసిని కాను. ఇక్కడ నేను యాత్రికుడను మాత్రమే. అందుచేత నా భార్యను పాతిపెట్టుటకు నాకు స్థలము లేదు. నేను నా భార్యను పాతిపెట్టడానికి దయచేసి నాకు కొంత స్థలం ఇవ్వండి” అన్నాడు.
5 హిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు. 6 “అయ్యా, మా మధ్య మీరు దేవుని మహా నాయకులలో ఒకరు. చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేందుకు మా శ్రేష్ఠమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు. చనిపోయిన వాళ్లను పాతిపెట్టే మా స్థలాల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మీ భార్యను పాతిపెట్టడానికి మేము ఎవ్వరం అడ్డు చెప్పం.”
7 అబ్రాహాము లేచి ప్రజలకు నమస్కరించాడు. 8 అబ్రాహాము వాళ్లతో చెప్పాడు: “నేను నా భార్యను పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయగోరితే, సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా మీరు మాట్లాడండి. 9 మక్పేలా గుహను నేను కొనాలని కోరుతున్నాను. ఇది ఎఫ్రోను స్వంతం. అది అతని పొలం చివరిలో ఉంది. దాని విలువ ఎంతో అంత మొత్తం నేను చెల్లిస్తాను. పాతిపెట్టే స్థలంగా దీనిని నేను కొంటున్నట్లు మీరంతా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను.”
10 ఎఫ్రోను ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఎఫ్రోను అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు: 11 “లేదయ్యా, నేను ఆ స్థలం ఇక్కడ మా అందరి ప్రజల సమక్షంలో నీకిచ్చేస్తాను. ఆ గుహను నేను నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టుకొనేందుకు ఆ స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.”
12 అప్పుడు అబ్రాహాము హిత్తీయుల ముందు వంగి నమస్కారం చేశాడు. 13 అబ్రాహాము, “ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించు. నా మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు.
14 అబ్రాహాముకు ఎఫ్రోను ఇలా జవాబు చెప్పాడు: 15 “అయ్యా, నా మాట వినండి. 400 తులాల వెండి మీకు గాని నాకు గాని ఏపాటి? భూమిని తీసుకొని, చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో.”
16 తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి ఆ వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము అతనికి ఇచ్చాడు.
17-18 కనుక ఎఫ్రోను పొలానికి స్వంతదారులు మారిపోయారు. ఈ పొలం మమ్రేకు తూర్పున మక్పేలాలో ఉంది. ఆ పొలానికి, పొలంలో ఉన్న గుహకు, అందులోని చెట్లన్నిటికీ అబ్రాహాము స్వంతదారుడయ్యాడు. ఎఫ్రోను అబ్రాహాముల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ పట్టణ ప్రజలంతా చూశారు. 19 ఇది జరిగిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రాహాము తన భార్యను పాతిపెట్టాడు (అది కనానులోని హెబ్రోను).
3 మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము. 2 అందుచేత తిమోతిని పంపించి మేము ఏథెన్సులో ఉండిపొయ్యాము. కనుక దేవుని సేవ చేయటంలో మరియు క్రీస్తును గురించి సువార్త ప్రచారం చేయటంలో మాతో కలిసి పనిచేసిన మా సోదరుడు తిమోతిని ప్రోత్సాహ బలం కోసం మీ దగ్గరకు పంపాము. 3 ఈ హింసల కారణంగా మీలో ఎవ్వరూ వెనుకంజ వేయరాదని మా ఉద్దేశ్యము. ఈ హింసలను అనుభవించటం మన విధి అని మీకు బాగా తెలుసు. 4 నిజానికి, మేము మీతో ఉన్నప్పుడే మనము ఈ హింసల్ని అనుభవించవలసి వస్తుందని మీకు చెప్పాము. మేము అన్నట్టుగానే జరిగింది. మీరు గమనించే ఉంటారు. 5 ఆ కారణంగా నేనిక ఓపికతో ఉండలేక మీ విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటానికి అతణ్ణి పంపాను. ఏదో ఒక విధంగా సాతాను మిమ్మల్ని శోధిస్తాడని, నా శ్రమ వృధా అయిపోయిందని భయపడ్డాను.
© 1997 Bible League International