Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:41-48

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

ఆదికాండము 16:1-15

పనిపిల్ల హాగరు

16 అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా. కనుక మీరు నా పనిమనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు.

కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి).

అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది. అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది.

కాని అబ్రాము శారయితో, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్లు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది.

హాగరు కొడుకు ఇష్మాయేలు

ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది. “హాగరూ, నీవు శారయి పనిమనిషివి గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆ దూత అడుగగా,

“నా యజమానురాలు శారయి నుండి పారిపోతున్నాను” అని చెప్పింది హాగరు.

“నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, ఆమెకు లోబడి నడుచుకో” అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది. 10 “నీలో నుండి అనేక జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు” అని కూడ యెహోవా దూత చెప్పడం జరిగింది.

11 ఇంకా యెహోవా దూత,

“ఇప్పుడు నీవు గర్భవతివి,
    మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు.
అతనికి ఇష్మాయేలు[a] అని పేరు పెడతావు.
    ఎందుచేతనంటే, నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.
12 ఇష్మాయేలు అడవి గాడిదలా
    అదుపులేక, స్వేచ్ఛగా ఉంటాడు
అతడు అందరికి వ్యతిరేకమే
    ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే
తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు
    కాని అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు.”

అని చెప్పాడు.

13 ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక క్రొత్త పేరు ప్రయోగించింది. “నన్ను చూసే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. “ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా చెప్పింది. 14 కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి[b] అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి.

15 హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు.

2 కొరింథీయులకు 6:14-7:2

అవిశ్వాసులతో కలిసిపోకండి

14 అవిశ్వాసులతో అంటిపెట్టుకోకండి. నీతికి, దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలుగుకూ, చీకటికి ఏమి సహవాసము? 15 క్రీస్తుకు, బెలియాలుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం ఉన్నవానికి, విశ్వాసం లేనివానికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? 16 దేవుని ఆలయానికి, విగ్రహాలకు ఒడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను వాళ్ళ మధ్య నడుస్తూ వాళ్ళతో జీవిస్తాను. వాళ్ళు నా ప్రజగా,
నేను వాళ్ళ దేవునిగా ఉంటాము.”(A)

17 “కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి.
అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను
    అని ప్రభువు అన్నాడు.”(B)

18 “నేను మీకు తండ్రిగా ఉంటాను.
    మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిసంపన్నుడైన ప్రభువు అంటున్నాడు.”(C)

మిత్రులారా! మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. కనుక మన దేహాలకు, మన ఆత్మలకు కలిగిన మలినాన్ని కడిగి పరిశుద్ధమౌదాం. మనకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక పరిపూర్ణత పొందటానికి ప్రయత్నం చేద్దాం.

పౌలు యొక్క సంతోషం

మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు. మా స్వలాభానికి ఎవ్వరినీ దోచుకోలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International