Revised Common Lectionary (Semicontinuous)
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)
మెల్కీసెదెకు
18 షాలేము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు. 19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు:
“అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక,
దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.
20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం
నీ శత్రువుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేశాడు.”
యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు. 21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి, తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.
22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని, ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవాదేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను. 23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేశానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’ 24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలినవారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”
మెలితే ద్వీపం
28 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము. 2 ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. 3 పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. 4 ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
5 కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు. 6 వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
7 ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కారాలు చేసాడు. 8 పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 9 ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది.
10 ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
© 1997 Bible League International