Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 29

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

యోబు 38:39-39:12

39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా?
    ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో
    పండుకొని లేక కూర్చొని ఉంటాయి.
41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు
    కాకులను పోషించేది ఎవరు?

39 “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా?
    తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?
యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా?
    అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?
అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి.
    అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి.
    అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.

“యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు?
    వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?
అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను).
    అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.
అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు.
    ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.
అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి.
    అక్కడే అవి గడ్డి తింటాయి.
    తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.

“యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా?
    రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుంది?
10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా?
    నీ కోసం అది లోయలను దున్నుతుందా?
11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు
    నీవు దానిమీద ఆధార పడగలవా?
    మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?
12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు
    అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?

1 కొరింథీయులకు 12:1-3

పవిత్రాత్మ వరాలు

12 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International