Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
దేవుడు యోబుతో మాట్లాడటం
38 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన,
తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే వీడు ఎవడు?
3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు.
నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు.
4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు?
నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు?
నీకు తెలిసినట్టే ఉంది! కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు?
6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి?
భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి.
దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
8 “యోబూ, భూమి అగాధములో నుండి
సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?
9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను.
మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.
10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను.
మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.
11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు.
నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.
8 కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకు. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించు.
9 దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. 10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.
11 ఈ సువార్తను ప్రకటించటానికి నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు. 12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.
© 1997 Bible League International