Revised Common Lectionary (Semicontinuous)
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
ఇశ్రాయేలీయులతో దేవుని ఒడంబడిక
19 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమైన మూడో నెలలో వారు సీనాయి అరణ్యము చేరుకొన్నారు. 2 ప్రజలు రెఫిదీము విడిచి, సీనాయి అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బసచేసారు. 3 అప్పుడు మోషే పర్వతం[a] మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు: 4 ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె[b] నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను. 5 కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. 6 మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.”
7 కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. 8 ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు.
తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు. 9 “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు.
అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.
పవిత్రాత్మ రావటం
2 పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు. 2 తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది. 3 అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి. 4 అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.
5 అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు. 6 ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.
7 వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? 8 అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? 9 మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, 10 ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, 11 యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.
© 1997 Bible League International