Revised Common Lectionary (Semicontinuous)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
ప్రజలు దేవునికి భయపడటం
22 “మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద శబ్దంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని నాకు ఇచ్చాడు.
23 “పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధకారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ పెద్దలూ నా దగ్గరకు వచ్చారు. 24 వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బ్రతకటం సాధ్యమేనని ఈవేళ మేము చూశాము. 25 కానీ మన దేవుడైన యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయంకర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము చావటం మాకు యిష్టంలేదు. 26 సజీవ దేవుడు మాట్లాడటం మేము విన్నట్టుగా వినికూడ బ్రతికిన మనిషి ఎన్నడూ ఎవ్వడూ లేడు. 27 మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’
మోషేతో యెహోవా మాట్లాడటం
28 “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే. 29 వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.
30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. 31 అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’.
32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. 33 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.
నీతి కోసం బాధలనుభవించటం
8 చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. 9 అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది:
“బ్రతకాలని ఇష్టపడే వాడు,
మంచిరోజులు చూడదలచినవాడు,
తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి.
తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.
11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి.
శాంతిని కోరి సాధించాలి.
12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు.
వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు.
కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”(A)
© 1997 Bible League International