Revised Common Lectionary (Semicontinuous)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
8 తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: 9 “నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. 10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను. 11 ఇదే నీకు నా వాగ్దానం. వరదనీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”
12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. 13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. 14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు. 15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. 16 మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకును, భూమిమీద సకల ప్రాణులకును మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”
17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని యెహోవా నోవహుతో చెప్పాడు.
ఓడ పగిలి పోవటం
39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. 40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. 41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.
42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, 43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44 మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
© 1997 Bible League International