Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66:8-20

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[a] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

ఆదికాండము 6:5-22

భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్లు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్లు యెహోవా చూశాడు. ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.”

అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు.

నోవహు—జలప్రళయం

ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు. 10 నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.

11-12 దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.

13 కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. 14 చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.

15 “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. 16 కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.

17 “నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదికి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. 18 అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. 19 భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనివ్వు. 20 భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. 21 అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”

22 వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు.

అపొస్తలుల కార్యములు 27:1-12

పౌలు రోమాకు వెళ్ళటం

27 మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను “యూలి” అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. మేము ఆసియ తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియ అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ ప్రాంతంలోని థెస్సలొనీకకు చెందిన అరిస్తార్కు అనేవాడు మా వెంట ఉన్నాడు.

మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. అక్కడినుండి మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని నీళ్లలో ప్రయాణం సాగించాము. కిలికియ, పంఫూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ “లుకియ” ప్రాంతంలో ఉన్న “మూర” అనే పట్టణాన్ని చేరుకున్నాము. మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న “అలెక్సంద్రియ” ఓడను చూసి, మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు.

ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా “క్నిదు” తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల ముందుకు వెళ్ళలేక పోయ్యాము. అందువల్ల దక్షిణంగా వెళ్ళి “క్రేతు” ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని “సల్మోనే” తీరంగుండా ప్రయాణం సాగించాము. ఆ నీళ్లలో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా “మంచి రేవులు” అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది.

అప్పటికే చాలా కాలం వృథా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం[a] చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడమని చెబుతూ, 10 “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు. 11 కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. 12 వాళ్ళున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికిరాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించమని సలహాయిచ్చారు. చలికాలం గడపటానికి “ఫీనిక్సు” అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్య దిశలనుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International