Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
20 గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు. 21 రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు. 22 కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు. 23 ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.
24 షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.
యేసు, అబ్రాహాము
48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.
49 యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. 50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. 51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.
52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. 53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.
54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. 55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.
57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.
58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. 59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.
© 1997 Bible League International