Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
దేవుడు అబ్రామును పిలచుట
12 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు,
“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు.
నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి,
నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
2 నిన్ను ఆశీర్వదిస్తాను.
నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను.
నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను.
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు
నీ పేరు ఉపయోగిస్తారు.
3 నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను.
నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను.
భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి
నేను నిన్ను ఉపయోగిస్తాను.”
స్తెఫనును బంధించటం
8 దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. 9 కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.
11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.
13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.
© 1997 Bible League International