Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
16 “వెళ్లి ఇశ్రాయేలు సమాజంలోని పెద్దలందరిని సమావేశపరిచి, ‘మీ పూర్వీకుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షం అయ్యాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు. మిమ్మల్ని గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచించాను. 17 ఈజిప్టులో మీరు అనుభవిస్తున్న శ్రమలనుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయానికొచ్చాను. ప్రస్తుతం కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, అనే రకరకాల ప్రజలకు చెందిన ఒక దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. చాలా మంచి మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను’ అని వాళ్లతో చెప్పు.
18 “పెద్దలు (నాయకులు) నీ మాట వింటారు. అప్పుడు నీవు, పెద్దలు (నాయకులు) కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లాలి. ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మూడు రోజుల దూరము అరణ్యంలోనికి ప్రయాణం చేసి వెళ్లమని ఆయన చెప్పాడు. అక్కడ మా యెహావా దేవునికి మేము బలులు అర్పించాలి. అని నీవు అతనితో చెప్పాలి.’
19 “అయితే ఈజిప్టు రాజు మిమ్మల్ని పోనియ్యడని నాకు తెలుసు. అతడు మిమ్మల్ని పోనిచ్చేటట్టు ఒక మహాశక్తి మాత్రమే అతణ్ణి బలవంతం చేస్తుంది. 20 కనుక ఈజిప్టు మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. ఆ దేశంలో అద్భుతాలు జరిగేటట్టు చేస్తాను. నేను అలా చేసిన తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు. 21 అంతే కాదు ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజలమీద దయ చూపించేటట్టుగా చేస్తాను. అందుచేత మీరు వెళ్లిపోయేటప్పుడు నీ ప్రజలకు వాళ్లు కానుకలను ఇస్తారు.”
22 “హీబ్రూవాళ్లలో ప్రతి స్త్రీ తన పొరుగున ఉండే ఈజిప్టు వాళ్లను, ఆ ఇళ్లలో వుండే వాళ్లందర్నీ అడగ్గానే వాళ్లు ఆమెకు కానుకలు ఇస్తారు. వెండి, బంగారం, మంచి బట్టలు, కానుకలుగా మీవారికి దొరుకుతాయి. మీరు ఈజిప్టు విడిచి వెళ్లేటప్పుడు మీరు ఆ కానుకలను మీ పిల్లలకు పెట్టాలి. ఈ విధంగా ఈజిప్టు ఐశ్వర్యాన్ని మీరు తీసుకోవాలి.”
మోషే మిద్యాన్నివదలుట
18 అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే.
“నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో.
19 తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు.
20 కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు.
పరిపాలకుల పట్ల, అధికారుల పట్ల వినయం
13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, 14 లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు. 15 మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక. 16 స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి. 17 అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి.
© 1997 Bible League International