Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 23

దావీదు కీర్తన.

23 యెహోవా నా కాపరి
    నాకు కొరత ఉండదు
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
    ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
    ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
    నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
    నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
    నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
    నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
    మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.

నిర్గమకాండము 2:15-25

15 మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు.

మిద్యానులో మోషే

మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. 16 మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17 కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా వెళ్లగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.

18 తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అని అన్నాడు.

19 “గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను మాకు సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు.

20 అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన కూతుళ్లతో.

21 అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు. 22 సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము[a] అని మోషే పేరు పెట్టాడు. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు.

ఇశ్రాయేలీయులకు సహాయం చేయుటకు దేవుడు నిశ్చయించుకొనుట

23 చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు. 24 దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు. 25 ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.

1 పేతురు 2:9-12

కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.

10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
    ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
    కాని యిప్పుడు లభించింది.

దేవుని కోసం జీవించండి

11 ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 12 యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International