Revised Common Lectionary (Semicontinuous)
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
యోనా ప్రార్థన
2 చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు:
2 “నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను.
నేను యెహోవా సహాయం అర్థించాను.
ఆయన నా ప్రార్థన ఆలకించాడు!
నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను.
యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా
నీవు నా మొరాలకించావు!
3 “నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు.
తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి.
నేనీ అగాధ సముద్రం లోతులదాకా పోయాను.
నా చుట్టూ జల ప్రళయం.
4 ‘ఇక నేను చూడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను.
కాని సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను.
5 “సముద్రజలం నన్ను ముంచివేసింది.
నీరు నా నోటిని మూసివేసింది,
నేను శ్వాస పీల్చుకోలేకుండా ఉన్నాను.
ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను.
సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి.
6 పర్వతాల పునాదులున్న చోట,
సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను.
ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను.
కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధినుండి బయటకు లేపాడు!
ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు!
7 “నా ఆత్మ నిరాశ చెందింది,
అప్పుడు నేను యెహోవాను తలచుకొన్నాను.
యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను.
నీ పవిత్రాలయంలో నీవు నా ప్రార్థనలు విన్నావు.
8 “కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు.
కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు.
9 యెహోవానుండి మాత్రమే రక్షణ లభిస్తుంది!
యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను.
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను.
నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.”
10 అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 8:11-12; లూకా 11:29-32)
38 ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని మా కోరిక!” అని అన్నారు.
39 కాని ఆయన చెప్పాడు: “దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు. 40 ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు. 41 నీనెవె ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు యోనా కంటె గొప్పవాడు యిక్కడున్నాడు.
42 “దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
© 1997 Bible League International