Revised Common Lectionary (Semicontinuous)
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
దేవుని పిలుపు—యోనా పారిపోవుట
1 అమిత్తయి కుమారుడైన యోనాతో[a] యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు: 2 “నీనెవె[b] ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కనుక నీవు ఆ నగరానికి వెళ్లి, వారు చేసే చెడు పనులు మానుకోమని చెప్పు.”
3 దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కనుక యెహోవాకు దూరంగా యోనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే[c] పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు[d] నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఈ ఓడలోనున్న జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు.
పెనుతుఫాను
4 కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవదీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా అయింది. తుఫాను తీవ్రంగా రేగింది. ఓడ పగిలిపోవటానికి సిధ్ధమైంది. 5 ఓడ మునగకుండా అందులో ఉన్నవారు దానిని తేలిక చేయదల్చారు. అందుచేత వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి ఓడ క్రింది భాగంలోకి వెళ్లాడు.
యోనా నిద్రపోతూ ఉన్నాడు. 6 ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.”
తుఫానుకు కారణం ఏమి?
7 పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, “మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవటానికి మనం చీట్లు వేయాలి” అని అనుకున్నారు.
అందువల్ల వారు చీట్లు వేశారు. ఈ కష్టమంతా యోనా వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది. 8 అప్పుడు ఆ మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు ఈ కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కనుక నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమి పని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఎవరు?”
9 అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెబ్రీయుణ్ణి (యూదా జాతివాణ్ణి). పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.”
10 తాను యెహోవానుండి పారిపోతున్నట్లు యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ మనుష్యులు చాలా భయపడిపోయారు. ఆ మనుష్యులు యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన అపరాధం చేశావు?” అని అడిగారు.
11 గాలి, అలలు సముద్రంలో రానురాను మరింత తీవ్రమవుతున్నాయి. అందువల్ల ఆ మనుష్యులు యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఏమిచేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు మేము ఏమిచేయాలి?” అని అడిగారు.
12 యోనా ఆ మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే ఈ తుఫాను సముద్రంలో చెలరేగింది. కనుక నన్ను సముద్రంలోకి తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది”
13 కాని ఆ మనుష్యులు యోనాను సముద్రంలోకి తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయలేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను మరింత తీవ్రమయ్యాయి.
యోనాకు శిక్ష
14 అందువల్ల ఆ మనుష్యులు యెహోవాకు ఇలా విన్నవించుకున్నారు: “ప్రభూ! ఇతడు చేసిన చెడు కార్యాల దృష్ట్యా మేము ఈ మనుష్యుని సముద్రంలోకి తోసి వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరారోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని చంపినందుకు దయచేసి నీవు మమ్ముల్ని చనిపోయేలాగు చేయవద్దు. నీవు యెహోవావని మాకు తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి మాపట్ల కరుణ చూపు.”
15 పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విసరివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతించింది! 16 ఆ మనుష్యులు ఇదంతా చూసి భయపడసాగారు. యెహోవాపట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు.
17 యోనా సముద్రంలో పడగానే యోనాను మింగటానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. ఆ చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.
19 మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.
20 కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డవాళ్ళలో ఆయన ప్రథముడు. 21 ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చినట్లు, పునరుత్థానం కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. 22 ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయినవాళ్ళు బ్రతుకుతారు. 23 ప్రతీ ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించినవాళ్ళు బ్రతికింపబడతారు. 24 అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్నవాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు.
25 ఎందుకంటే, దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే దాకా ఆయన రాజ్యం చెయ్యాలి. 26 చివరి శత్రువైన మృత్యువు నాశనము చేయబడుతుంది. 27 ఎందుకంటే లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. “అన్నిటినీ” ఆయన పాదాల క్రింద ఉంచాడు అని అంటే, వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు. 28 కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు.
© 1997 Bible League International