Revised Common Lectionary (Semicontinuous)
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
36 అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు. నాకు ఋజువు చూపు! 37 నేను కళ్ళెంలో గొర్రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయేలును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని నేను తెలుసుకొంటాను.”
38 సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి ఆ గొర్రెచర్మాన్ని పిండాడు. ఆ గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.
39 అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోపగించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. గొర్రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని చెప్పాడు.
40 ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా నేల మంచుతో తడిసి ఉంది.
చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం
12 కాని మేము క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయినవాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? 13 అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. 14 క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృథా అయినట్లే కదా! 15 అంతే కాదు. దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలా కాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పినవాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయినవాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు. 16 ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. 17 క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట. 18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. 19 మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.
20 కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డవాళ్ళలో ఆయన ప్రథముడు.
© 1997 Bible League International