Revised Common Lectionary (Semicontinuous)
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. 11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. 12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”
13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! 14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”
15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు 16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు. 17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను. 18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”
ఈజిప్టు సైన్యాన్ని యెహోవా ఓడించటం
19 ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది 20 ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.
21 మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది. 22 ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి. 23 అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి. 24 ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు. 25 రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు.
26 అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచేస్తాయి.” అని చెప్పాడు.
27 కనుక తెల్లవారు ఝామున మోషే తన చేతిని సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్లు యధాస్థానానికి వచ్చి పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈజిప్టు వాళ్లు సముద్రంలో కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు. 28 నీళ్లు యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వదళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన ఫరో సైన్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. వాళ్లలో ఒక్కడూ బతకలేదు.
29 అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడి ఎడమ ప్రక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి. 30 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టువాళ్లు చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎర్రసముద్ర తీరాన ఈజిప్టువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు చూచారు. 31 యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.
20 అప్పుడు అహరోను సోదరి, మహిళా ప్రవక్తి మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా పలికింది,
21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు
గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను,
దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”
5 మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. 6 వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.[a] 7 మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
8 కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. 9 మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. 10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. 11 ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి[b] భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
© 1997 Bible League International