Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 81

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆదికాండము 29:1-14

యాకోబు రాహేలును కలసికొనుట

29 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు త్రాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు త్రాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా త్రాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.

“సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు.

“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.

అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని అడిగాడు.

“మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.

అప్పుడు యాకోబు “అతను ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.

“అతను బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది అతని కుమార్తె. ఆమె పేరు రాహేలు, అతని గొర్రెల్ని తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.

“చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనియ్యండి” అన్నాడు యాకోబు.

కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు త్రాగుతాయి” అన్నారు.

కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.) 10 రాహేలు లాబాను కుమార్తె. యాకోబు తల్లియైన రిబ్కాకు లాబాను సోదరుడు. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. 11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 12 తను ఆమె తండ్రి బంధువును అనీ, రిబ్కా కుమారుడననీ యాకోబు రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో ఆ విషయాలు చెప్పింది.

13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.

14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.

1 కొరింథీయులకు 10:1-4

ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు

10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International