Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 81

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆదికాండము 24:1-27

ఇస్సాకు కోసం భార్య

24 అబ్రాహాము కురువృద్ధుడయ్యేంత వరకు జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాహాము యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుణ్ణి అబ్రాహాము తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా తొడక్రింద పెట్టు. ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వనని భూమ్యాకాశాలకు దేవుడగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు. నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.”

ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారున్ని నేను నీ స్వంత దేశానికి తీసుకొని వెళ్లవచ్చునా?” అని అడిగాడు.

అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారున్ని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు. పరలోక దేవుడైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి, నా కుటుంబానికి మాతృదేశం. కాని ఈ నూతన దేశం నీ కుటుంబానికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేశాడు. ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి తెస్తావు. అయితే ఆ అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరిపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”

కనుక ఆ సేవకుడు తన యజమాని తొడక్రింద తన చేయి పెట్టి వాగ్దానం చేశాడు.

అన్వేషణ ప్రారంభం

10 అబ్రాహాము ఒంటెలలో పదింటిని తీసుకొని ఆ సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకెళ్లాడు. మెసపొతేమియాలోని[a] నాహోరు పట్టణం వెళ్లాడు ఆ సేవకుడు. 11 పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.

12 ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు. 13 ఇదిగో, మంచి నీళ్ల బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు. 14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు త్రాగాలి, నీ కడవ క్రింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘త్రాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”

భార్య దొరికింది

15 అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. 16 ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది. 17 అప్పుడు ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు త్రాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.

18 రిబ్కా త్వరగా తన భుజంమీద నుండి కడవ దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో త్రాగండి” అంది రిబ్కా. 19 అతను త్రాగటానికి నీళ్ళు పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా. 20 రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.

21 ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసుకోవాలనుకొన్నాడు. 22 ఒంటెలు నీళ్లు త్రాగడం అయిపోగానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు అతడు ఆమెకు ఇచ్చాడు. 23 “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు.

24 “నా తండ్రి బెతూయేలు. నాహోరు, మిల్కాయొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది. 25 తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు పండుకొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని ఆమె చెప్పింది.

26 ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి, 27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతించబడు గాక. యెహోవా నా యజమానుని పట్ల దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు.

2 యోహాను

దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా, మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.

తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి మనలో ఉండాలని కోరుతున్నాను.

మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను. ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.

యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు. పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.

క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది. 10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చినవాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటివాణ్ణి పలుకరించకండి. 11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.

12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని, సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. 13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం,[a] వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International