Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
ఒక క్రొత్త సమయం వస్తుంది
17 “చూడు, నేను ఒక క్రొత్త ఆకాశాన్ని ఒక క్రొత్త భూమిని చేస్తాను.
గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు.
ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు.
18 నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు.
నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు.
సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను.
మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను.
19 “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను.
నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను.
ఆ పట్టణంలో మరల ఎన్నడూ
ఏడుపు, దుఃఖం ఉండవు.
20 జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిశువు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు.
కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు.
జన్మించే ప్రతి శిశువు దీర్ఘకాలం జీవిస్తుంది.
వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు.
వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు.
(అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బ్రతికినా అన్నీ కష్టాలే.)
21 “ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి అక్కడ నివసిస్తాడు.
ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట నాటితే ఆ వ్యక్తి ఆ తోటలోని ద్రాక్ష పండ్లు తింటాడు.
22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో
నివసించటం అనేది జరుగదు.
ఒకడు ఒక తోటను నాటగా మరొకడు
ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు.
వృక్షాలు బ్రతికినంత కాలం నా ప్రజలు బ్రతుకుతారు.
నేను ఏర్పరచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.
23 ప్రతిఫలం ఏమి లేకుండా ప్రజలు మరల ఎన్నడూ పనిచేయరు.
చిన్నతనంలోనే మరణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు.
నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించబడతారు. నా ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతారు.
24 వారికి అవసరమైనవి, వారు అడగకముందే నేను తెలుసుకొంటాను.
సహాయంకోసం వారు నన్ను అడుగుట ముగించక ముందే నేను వారికి సహాయం చేస్తాను.
25 తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి.
సింహాలు పశువులతో కలిసి మేస్తాయి.
నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.”
ఇవన్నీ యెహోవా చెప్పాడు.
6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:
7 “దేవుడు ఎవరి తప్పుల్ని,
పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో
వెయ్యడో వాళ్ళు ధన్యులు.”(A)
9 మరి, సున్నతి చేయించుకొన్నవాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. 10 దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. 11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్నవాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. 12 అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.
విశ్వాసంద్వారా దేవుని వాగ్దానం పొందెను
13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు.
© 1997 Bible League International