Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.
ప్రజలు దేవుణ్ణి వెంబడించాలని చెప్పాలి
58 మీకు చేతనైనంత గట్టిగా కేకలు వేయండి. మీరు ఆపవద్దు.
బూరలా కేకలు వేయండి.
ప్రజలు చేసిన చెడు పనులను గూర్చి వారికి చెప్పండి.
యాకోబు వంశానికి వారి పాపాలను గూర్చి చెప్పండి.
2 అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ వస్తారు.
మరియు ప్రజలు నా మార్గాలు తెలుసుకోవాలని కోరుతారు.
అప్పుడు వారు సరైన పనులు చేసే ఒక రాజ్యం అవుతారు.
ఆ ప్రజలు దేవుని మంచి ఆదేశాలను పాటించడం మానివేయరు.
వారికి న్యాయంగా తీర్పు తీర్చమని ఆ ప్రజలు నన్ను అడుగుతారు.
దేవుని న్యాయ నిర్ణయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని కోరుకొంటారు.
3 ఇప్పుడు ఆ ప్రజలు చెబుతారు: “నీ గౌరవ సూచకంగా మేము భోజనం మానివేశాం. నీవెందుకు మమ్మల్ని చూడవు? నీ గౌరవ సూచకంగా మేము మా దేహాలను బాధించుకొంటాం. నీవెందుకు మమ్మల్ని గమనించవు?”
అయితే యెహోవా అంటున్నాడు, “ఆ ప్రత్యేక దినాల్లో భోజనం చేయకుండా ఉండి మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకొనేందుకు ఈ పనులు చేస్తారు. మరియు మీరు మీ శరీరాలను గాక, మీ సేవకుల్ని శిక్షిస్తారు. 4 మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసర కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం కొసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతించుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు ఇష్టం లేదు. నేను కోరేది అంతా 5 ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా?
6 “నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రులను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. 7 ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.”
8 వీటిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబడిస్తుంది. 9 అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్తారు, యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహోవాకు గట్టిగా కేకెలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే ఉన్నాను” అంటాడు.
మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మానివేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా మాట్లాడటం. వారిని నిందించటం మీరు మానివేయాలి. 10 ఆకలితో ఉన్న ప్రజలను గూర్చి మీరు విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా మీరు ప్రకాశిస్తారు.
11 అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.
12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ క్రొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మార్కు 9:33-37; లూకా 9:46-48)
18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.
2 యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: 3 “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 4 అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.
5 “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.
పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం
(మార్కు 9:42-48; లూకా 17:1-2)
6 “కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. 7 ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది.
© 1997 Bible League International