Revised Common Lectionary (Semicontinuous)
దేవుని ఆజ్ఞలు పొందడానికి మోషే వెళ్లటం
12 “పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న రెండు రాళ్ల మీద రాసాను. ఈ ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను” అని యెహోవా మోషేతో చెప్పాడు.
13 కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు. 14 మోషే, “మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లండి,” అని ఆ పెద్దలతో (నాయకులతో) చెప్పాడు.
మోషే దేవున్ని కలుసుకోవడం
15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది. 16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు. 17 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.
18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.
2 యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
2 యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
3 “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.
4 కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
“రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.
7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
మరియు నీవు నా కుమారుడివి.
8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”
10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
ప్రవచన వాక్యం
16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. 17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది”[a] అని, 18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.[b]
19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. 20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. 21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.
యేసుని రూపాంతరం
(మార్కు 9:2-13; లూకా 9:28-36)
17 యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు. 2 ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి. 3 అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
4 పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పర్ణశాలలు నిర్మిస్తాము—మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అని అన్నాడు.
5 అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది.
6 ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు. 7 యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడకండి!” అని అన్నాడు. 8 వాళ్ళు తలెత్తి చూసారు. వాళ్ళకు యేసు తప్ప యింకెవరూ కనపడలేదు.
9 వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్యకుమారుడు బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
© 1997 Bible League International