Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 2

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

1 రాజులు 21:20-29

20 తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు.

ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తూనే వచ్చావు. 21 అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను. 22 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు. 23 ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి. 24 నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.”

25 అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది. 26 కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.

27 ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు.

28 ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు: 29 “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బ్రతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”

మార్కు 9:9-13

వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.

10 అందువల్ల వాళ్ళావిషయాన్ని తమలోనే దాచుకొని, చనిపోయి బ్రతికి రావటాన్ని గురించి చర్చించుకొన్నారు. 11 వాళ్ళాయనతో, “ఏలీయా మొదట రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు?” అని అడిగారు.

12 యేసు సమాధానం చెబుతూ, “ఏలీయా మొదట వచ్చినప్పుడు సరి చేస్తాడన్నమాట నిజం. కాని, మనుష్యకుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీకరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు వ్రాసారు? 13 ఏలీయా వచ్చాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా ప్రజలు చేయలానుకొన్నవన్నీ ఇతనికి చేసారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International