Revised Common Lectionary (Semicontinuous)
ఆలెఫ్[a]
119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
2 యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
3 ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
వారు యెహోవాకు విధేయులవుతారు.
4 యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
6 అప్పుడు నేను నీ ఆజ్ఞలను
ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
7 అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!
34 “మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసుకొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని విశ్రాంతిని అనుభవిస్తుంది. 35 ఏడేండ్లకు ఒకసారి ఒక సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాళీగా ఉన్న ఆ సమయంలో అది పొందుతుంది. 36 శేషించిన ప్రజలు వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు. 37 ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు ఒకరిమీద ఒకరు కూలిపోతారు.
“మీరు మీ శత్రువులను ఎదిరించి నిలిచే అంతటి బలం మీకు ఉండదు. 38 ఇతర దేశాల్లో తప్పిపోతారు. మీ శత్రుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు. 39 కనుక మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శత్రుదేశంలో క్షీణించిపోతారు. వారు కూడా వారి పూర్వీకులవలెనే, వారి పాపంవలన క్షీణించిపోతారు.
నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది
40 “అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పుకొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకోవచ్చు. 41 ఒకవేళ నేను వారికి విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్ళను తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు నన్ను ఎరుగని వాళ్లలా ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే 42 అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
43 “ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిలిగిన వాళ్లు వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను ద్వేషించి, నా నియమాలను విధేయులయ్యేందుకు నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు గ్రహిస్తారు. 44 వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి. 45 వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండేందుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ చూసాయి. నేను యెహోవాను!”
46 అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా ఇచ్చాడు. ఆయన వాటిని మోషేకు ఇవ్వగా, మోషే వాటిని ప్రజలకు యిచ్చాడు.
మనం యితరుల్ని ప్రేమించాలని యేసు చెప్పాడు
7 ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. 8 అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.
9 తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. 10 సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. 11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.
12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
అందుకే మీకు వ్రాస్తున్నాను.
15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.
© 1997 Bible League International