Revised Common Lectionary (Semicontinuous)
నూన్
105 యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
ప్రజలు ధర్మశాస్త్రము వినుట
23 యూదా నాయకులందరిని యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు. 2 తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.
3 రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.
4 తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారికి రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకురమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకువెళ్లారు.
5 యూదా రాజులు కొందరు సామాన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.
6 యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
7 తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.
8-9 ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).
యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట
21 తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.
22 న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు. 23 యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.
24 కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేములోనున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.
25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.
మట్టి కుండలో సంపద
4 దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము. కనుక ధైర్యం కోల్పోము. 2 నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేసాము. మేము మోసాలు చెయ్యము. దైవసందేశాన్ని మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటివాళ్ళమో మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు. 3 మేము చెప్పే దైవసందేశం మూయబడితే నశించేవాళ్ళకు మాత్రమే అది మూయబడింది. 4 క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవసందేశం ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు[a] నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేసాడు. 5 మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము. 6 “చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!”[b] అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.
7 దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది. 8 మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు. 9 మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేనివాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు. 10 మేము అన్ని వేళలా యేసు మరణాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయన” జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 11 బ్రతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది.
© 1997 Bible League International