Revised Common Lectionary (Semicontinuous)
యెహోవా ఫిర్యాదు
6 యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను.
నీవు లేచి, పర్వతాలముందు నిలబడు.
వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.
2 తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది.
పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి.
భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి.
ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!
3 యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను?
మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను?
మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!
4 నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను!
ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను.
మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను.
నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.
5 నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి.
బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి.
అకాసియ (షిత్తీము) నుండి గిల్గాలువరకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి.
అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు తెలుసుకుంటారు!”
దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?
6 దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు,
నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి?
ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను
దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా?
7 యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా?
నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్ని బలి ఇవ్వనా?
నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో
భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?
8 మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు.
యెహోవా నీనుండి కోరేవి ఇవి:
ఇతరులపట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు.
ప్రజలపట్ల ప్రేమ, దయ కలిగిఉండటానికి ఇష్టపడు.
అణకువ కలిగి నీ దేవునితో జీవించు.
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
నిజమైన జ్ఞానము
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. 19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను.
పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”(A)
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! 21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. 23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. 24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. 25 దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్ఠలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. 27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. 28 ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. 29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. 30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. 31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”(B)
కొండ మీద ఉపదేశం
(లూకా 6:20-23)
5 యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. 2 యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు:
3 “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం.
కనుక వాళ్ళు ధన్యులు.
4 దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు.
కనుక వాళ్ళు ధన్యులు.
5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు.
కనుక వాళ్ళు ధన్యులు.
6 అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది.
కనుక వాళ్ళు ధన్యులు.
7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది.
కనుక వాళ్ళు ధన్యులు.
8 శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు.
కనుక వాళ్ళు ధన్యులు.
9 శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు.
కనుక శాంతి స్థాపకులు ధన్యులు.
10 నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం.
కనుక వాళ్ళు ధన్యులు.
11-12 “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.
© 1997 Bible League International