Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
17 “విదేశీయులకు, అనాధలకు న్యాయం జరిగేట్టు నీవు చూడాలి. ఒక విధవ దగ్గర తాకట్టుగా బట్టలు నీవెన్నటికీ తీసుకోకూడదు. 18 మీరు ఒకప్పుడు ఈజిప్టులో బానిసలు అని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడ్నుండి బయటకు తీసుకొనివచ్చాడని మరచిపోవద్దు. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
19 “నీవు నీ పొలంలో పంటకూర్చుకొంటూ, మరచిపోయి ఒక పన అక్కడే విడిచిపెట్టావనుకో, నీవు మళ్లీ దానికోసం వెళ్లకూడదు. విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం అది ఉంటుంది. వారికోసం నీవు కొంత ధాన్యం విడిచిపెడితే, నీ ప్రతి పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. 20 నీవు నీ ఒలీవ చెట్లను రాల్చినప్పుడు కొమ్మలను పరిశీలించేందుకు నీవు తిరిగి అక్కడకు వెళ్లకూడదు. నీవు అలా విడిచిపెట్టే ఒలీవలు విదేశీయులకు, అనాథలకు, విధవలకు ఉంటాయి. 21 నీ ద్రాక్షతోటనుండి నీవు ద్రాక్షా పండ్లు కూర్చుకొనేటప్పుడు, నీవు విడిచిపెట్టిన పండ్లు తీసుకొనేందుకు నీవు తిరిగి అక్కడికి వెళ్లకూడదు. ఆ ద్రాక్షాపండ్లు విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం ఉంటాయి. 22 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారని జ్ఞాపకం ఉంచుకో. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
25 “ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు వారి వివాదాన్ని విచారించి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు. 2 నిందితుడు కొరడా దెబ్బలు తినాల్సివస్తే, న్యాయమూర్తి అతణ్ణి బోర్లా పండుకోబెట్టాలి. న్యాయమూర్తి చూస్తూ ఉండగా ఎవరో ఒకరు ఆ దోషిని కొట్టాలి. అతని నేరానికి తగినన్ని దెబ్బలు ఆ దోషిని కొట్టాలి. 3 ఒక మనిషిని ఒకే సారి 40 కంటె ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. అంతకంటె ఎక్కువగా అతడ్ని కొడితే, నీ సోదరుని జీవితం అంటే నీకు లెక్కలేదని తెలుస్తుంది.
4 “నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం వేయకూడదు.
పెద్దలూ, తదితర సంగతుల్నిగూర్చి
17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు. 18 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “ధాన్యము తొక్కే ఎద్దు మూతి కట్టరాదు” మరియు “పని చేసే వానికి కూలి దొరకాలి” అని వ్రాయబడి ఉంది.
19 ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప సంఘం పెద్దల మీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు. 20 తప్పు చేసినవాళ్ళను బహిరంగంగా ఖండించు. అలా చేస్తే అది చూసి మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు.
21 నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు.
22 నీవు తొందరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతర్ల పాపాల్లో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో.
23 నీళ్ళు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు కావటానికి కొద్దిగా ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు.
24 కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వాళ్ళకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచున్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపిస్తాయి.
© 1997 Bible League International