Revised Common Lectionary (Semicontinuous)
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
“యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.
17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.
12 “యాకోబూ, నా మాట విను!
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను.
కనుక నా మాట వినండి.
నేనే ఆది, నేనే అంతం.
13 నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను.
ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది.
మరియు నేను గనుక వాటిని పిలిస్తే
అవి కలిసి నా ఎదుటికి వస్తాయి.
14 “కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి!
ఈ సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు.
యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు.
బబులోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.
15 “యెహోవా చెబుతున్నాడు, నేను అతన్ని[a] పిలుస్తానని నేను మీతో చెప్పాను.
మరియు నేను అతణ్ణి తీసుకొని వస్తాను.
అతడు జయించేట్టు నేను చేస్తాను.
16 నా దగ్గరకు వచ్చి, నా మాట వినండి.
ప్రజలు నా మాట వినగలుగునట్లు
మొదటనుంచి నేను తేటగా మాట్లాడాను.
బబులోను ఒక దేశంగా ప్రారంభమయినప్పుడు నేను అక్కడ ఉన్నాను.”
అంతట యెషయా, “ఇప్పుడు ఈ సంగతులు, ఆయన ఆత్మను మీతో చెప్పేందుకు నా ప్రభువైన యెహోవా నన్ను పంపుతున్నాడు” అని అన్నాడు. 17 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, రక్షకుడు, యెహోవా చెబుతున్నాడు,
“నేనే మీ దేవుణ్ణి, యెహోవాను.
మంచి పనులు చేయమని నేను మీకు ఉపదేశిస్తాను.
మీరు నడవాల్సిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను.
18 మీరు నాకు విధేయులై ఉంటే
అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తోన్న
నదివలె శాంతి లభించి ఉండేది.
సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి.
19 మీరు నాకు విధేయులై ఉంటే,
అప్పుడు మీకు ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు.
మీరు నాకు విధేయులై ఉంటే, అప్పుడు మీరు నాశనం చేయబడి ఉండేవాళ్లు కాదు.
మీరు నాతోనే కొనసాగి ఉండేవాళ్లు.”
20 నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి.
నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి.
ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి.
భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో
ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!
21 యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు.
ఎందుకంటే, ఆయన తన ప్రజలకోసం బండనుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక.
ఆయన బండను చీల్చాడు.
నీళ్లు ప్రవహించాయి.”
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మార్కు 2:18-22; లూకా 5:33-39)
14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.
16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. 17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.
© 1997 Bible League International