Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 40:6-17

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

నిర్గమకాండము 12:1-13

పస్కా పండుగ

12 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “ఈనెల[a] మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది. ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి. గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును. నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి. ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.

“ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి. గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద కాల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి. 10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.

11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి[b] (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)

12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను. 13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను.[c] ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.

నిర్గమకాండము 12:21-28

21 కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి. 22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు. 23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు[a] నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు. 24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది. 25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి. 26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు 27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు[b] యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.

28 మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు.

అపొస్తలుల కార్యములు 8:26-40

ఫిలిప్పు ఇతియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం

26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.

27 అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇతియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇతియొపీయుల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, 28 తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా,

29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అతన్ని కలుసుకో” అని అన్నాడు. 30 ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.

31 “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. 32 ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు:

“చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు
బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా
    ఆయన మాట్లాడ లేదు!
33 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు.
ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు.
    ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”(A)

34 ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. 35 ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.

36 ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. 37 ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. 38 ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. 39 వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు. 40 ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడినుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International